కరోనాను చులకనగా చూశారు... ఇప్పుడేమైందో చూడండి!: చంద్రబాబు

  • ఏపీ సర్కారుపై చంద్రబాబు విమర్శల దాడి
  • వలంటీర్లు ఏమయ్యారంటూ ప్రశ్నించిన చంద్రబాబు
  • ఏమైంది మీ చిత్తశుద్ధి అంటూ నిలదీత 
ఏపీలో కరోనా కేసుల సంఖ్య మూడున్నర లక్షలు దాటిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మొదట్లో కరోనా ప్రభావాన్ని చులకనగా చూడడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. 12 కోట్ల జనాభా ఉన్న మహారాష్ట్రతో 4.9 కోట్ల జనాభా ఉన్న ఏపీ కరోనా విషయంలో పోటీపడే పరిస్థితి నెలకొందని విమర్శించారు. పాజిటివ్ కేసుల విషయంలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉందని అన్నారు.

మనరాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే, వాటిలో 12 జిల్లాల్లో ఒక్కొక్కదాంట్లో 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వివరించారు. ప్రతి 10 లక్షల మందిలో 6,761 మందికి సోకినట్టు గణాంకాలు చెబుతున్నాయని, ఇదే అంశంలో జాతీయ సగటు చూస్తే 2600 మందికి సోకినట్టు తెలుస్తోందని చంద్రబాబు వివరించారు. దీనికేం సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నించారు. దేశంలో టాప్-30 కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మనవద్దే 9 ఉన్నాయని, టాప్-10లో మనవద్ద 3 ఉన్నాయని తెలిపారు.

పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఏపీ ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెబుతోందని, వలంటీర్లు ఏమయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు. వైరస్ ను ఎందుకు కట్టడి చేయలేకపోయారని నిలదీశారు. ఏమైంది మీ చిత్తశుద్ధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజున తాను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తే బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని అంటూ చులకనగా చూశారని మండిపడ్డారు.


More Telugu News