తమిళనాడుకు రెండో రాజధాని... సీఎంపై పెరుగుతున్న ఒత్తిడి!

  • తాజాగా ఇద్దరు మంత్రుల నుంచి డిమాండ్
  • మధురైని రెండో రాజధాని చేయాలని డిమాండ్
  • వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలంటున్న మంత్రులు
తమిళనాడులో రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చి, సీఎం పళనిస్వామిపై ఒత్తిడిని పెంచుతోంది.  రాష్ట్రంలో చెన్నైకి తోడు మధురైని కూడా రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, తాజాగా మంత్రులు ఆర్బీ ఉదయ్ కుమార్, సెల్లూరు రాజులు రెండో రాజధాని ఉండాలంటూ కోరారు. ఈ ప్రతిపాదన తనది కాదని, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ ఈ మేరకు ప్రతిపాదించారని, అప్పట్లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అడ్డుకున్నారని గుర్తు చేశారు.

తాజాగా మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ నగరంలోనే ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయని, అప్పట్లో మహాసభలు కూడా ఇక్కడే జరిగేవని అన్నారు. ఎంజీఆర్ హయాంలో ప్రపంచ తమిళ మహా సభలు కూడా ఇక్కడ జరిగాయని చెప్పారు. దివంగత సీఎం జయలలిత సైతం ఎన్నో కీలకమైన నిర్ణయాలను మధురైలోనే ప్రకటించారని చెప్పారు. తక్షణమే సీఎం స్పందించి, సెకండ్ క్యాపిటల్ పై కమిటీని వేయాలని ఆయన కోరారు.

కాగా, సోమవారం నాడు ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్, చెన్నై విస్తరణను ప్రస్తావిస్తూ, రోజురోజుకూ జనాభా పెరుగుతోందని, నగరం చుట్టూ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలకూ దాదాపు సమానదూరంలో ఉండే మధురైని రెండో రాజధానిగా చేయడం మినహా మరో మార్గం లేదని అన్నారు. సెకండ్ క్యాపిటల్ సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీ ఏర్పాటుకు పళనిస్వామి చర్యలు చేపట్టాలని అన్నారు.


More Telugu News