తిరుగులేని మారుతి సుజుకి ఆల్టో... చిన్న కారు గట్టి రికార్డు కొట్టింది!
- 2000 సంవత్సరంలో లాంచ్ అయిన ఆల్టో
- ఇప్పటివరకు 40 లక్షల యూనిట్ల విక్రయాలు
- దేశంలో ఇన్ని యూనిట్లు అమ్ముడైన తొలికారు ఆల్టో
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తయారుచేసే ఆల్టో కారు తిరుగులేని రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 40 లక్షల యూనిట్లు అమ్ముడైన ఆల్టో, దేశంలో ఇన్ని యూనిట్లు అమ్ముడైన ఏకైక మోడల్ గా ఘనత సాధించింది. ఆల్టో కారును మధ్యతరగతి ప్రజల ముచ్చటైన కారుగా పేర్కొంటారు. ఎందుకంటే అందుబాటులో ఉండే దీని ధర ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ప్రారంభ ధర రూ.3 లక్షలు కాగా, దీంట్లో టాప్ మోడల్ ధర రూ.4.36 లక్షలు మాత్రమే. మార్కెట్లో ఈ ధరల శ్రేణిలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఆల్టో అమ్మకాల పరంగానూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఆల్టో కారును మారుతి సుజుకి 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది.