దావూద్ అనుచరుడు అన్వర్ అరెస్ట్.. రూ. 22 లక్షల విలువైన పిస్టల్ స్వాధీనం!

  • ఢిల్లీలో అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
  • గతంలో పీఎస్ లోనే పోలీస్ ఇన్ఫార్మర్ ను చంపిన చరిత్ర
  • 2002లో అన్వర్ సోదరుడిని ఎన్ కౌంటర్ చేసిన ముంబై పోలీసులు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అన్వర్ ఠాకూర్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని చాంద్ బాగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద ఉన్న బ్రెజిల్ తయారీ సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్ విలువ అక్షరాలా రూ. 22 లక్షలు.

1992లో ఢిల్లీలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్లోనే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ను అన్వర్ కాల్చి చంపాడు. ఈ కేసులో ఆయనకు ఓ కోర్టు జీవితఖైదును విధించింది. అయితే, పెరోల్ పై బయటకు వచ్చిన ప్రతిసారి ఆయన పరార్ అయ్యేవాడు. నైరుతి ఢిల్లీ జిల్లాలో చెను గ్యాంగ్ ను పునరుద్ధరించే పనుల్లో అన్వర్ ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. అన్వర్ కు ఆరుగురు సోదరులు ఉన్నారు. వీరిలో ఒకరైన అష్రఫ్ ను 2002లో ముంబై పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇతను కూడా దావూద్ కోసం పని చేసేవాడు. ఫైజల్ ఉర్ రెహ్మాన్, బబ్లూ శ్రీవాస్తవ్ వంటి మాఫియా ముఠాలతో కూడా అన్వర్ కు సంబంధాలు ఉన్నాయి.


More Telugu News