పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి: చంద్రబాబు

  • తనకెందుకులే అనుకుంటే అల్లూరి గురించి చెప్పుకునేవాళ్లం కాదు
  • స్వాతంత్ర్య అమర వీరుల్లో విప్లవాగ్ని రగిలేది కాదు
  • అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని అందుకోవాలి
  • అప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది 
అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి 200 రోజులు గడుస్తున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్లు చేశారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళదామని చెప్పారు. 'మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈ రోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్లం కాదు. స్వాతంత్ర్య అమర వీరుల్లో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు' అని చెప్పారు.
 
'అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది' అని చెప్పారు.  

టీడీపీ నేత లోకేశ్‌ కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'ఈ రోజు రాజధాని ప్రాంత ప్రజలపై వైసీపీ ప్రభుత్వం సాగిస్తోన్న దారుణ మారణకాండ మాదిరిగానే...  ఆ రోజు మన్నెం ప్రజల హక్కులను తెల్లదొరలు కాలరాశారు. అయితే, నాడు గిరిజనులందరినీ ఏకంచేసి తెల్లవారి గుండెలదిరేలా చేశారు అల్లూరి సీతారామరాజు' అని చెప్పారు.

'నాటి అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకునే కథానాయకులై రాజధాని అమరావతి రైతులకు అండగా నిలవాలి. అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను' అని చెప్పారు.


More Telugu News