చైనా కంపెనీలతో రూ.5 వేల కోట్ల విలువైన ఒప్పందాలను నిలిపివేసిన మహారాష్ట్ర

  • సరిహద్దుల్లో ఘర్షణలు
  • భారత సైనికుల మృతి
  • మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం
  • ఒప్పందాల నిలిపివేతపై కేంద్రానికి సమాచారం ఇచ్చిన మహారాష్ట్ర
గాల్వన్ లోయలో ఘర్షణల అనంతరం భారత్ లో చైనాపై వ్యతిరేకత అధికమవుతోంది. ప్రజల్లోనే కాదు ప్రభుత్వాలు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర సర్కారు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న మూడు ఒప్పందాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ ఒప్పందాల విలువ రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుంది.

వీటిలో ఒక ఒప్పందం చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ (జీడబ్ల్యూఎం)తో కుదుర్చుకున్నారు. దీని విలువ రూ.3,770 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం పూణే సమీపంలోని తాలేగావ్ లో చైనా సంస్థ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చైనాకు చెందిన ఫోటాన్ సంస్థ రూ.1000 కోట్లతో ఓ యూనిట్ ఏర్పాటు చేస్తే, 1500 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని భావించారు. మరో సంస్థ హెంగ్లీ ఇంజినీరింగ్ కూడా రూ.250 కోట్లతో తాలేగావ్ వద్ద తన ప్లాంట్ ను విస్తరించాల్సి ఉంది.

అయితే, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది చనిపోవడంతో, తాము చైనా కంపెనీలతో భాగస్వామ్యాలను కొనసాగించదలచుకోలేదని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ వెల్లడించారు. ఒప్పందాల నిలిపివేత అంశంపై కేంద్రానికి కూడా సమాచారం అందించామని తెలిపారు. చైనా కంపెనీలతో ఇతరత్రా ఎలాంటి ఎంఓయూలు కుదుర్చుకోవద్దని భారత విదేశాంగ శాఖ కూడా సూచించిందని దేశాయ్ పేర్కొన్నారు.


More Telugu News