లోకేశ్ కు ఉన్న అర్హత ఏమిటి? ఎంపీ రఘురామకృష్ణంరాజు తేడా మనిషి: అంబటి రాంబాబు

  • వడ్డీతో సహా లోకేశ్ ఏం చెల్లిస్తాడు?
  • డైలాగులు మాట్లాడటం కాదు, దమ్ముండాలి
  • రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోక్కర్లేదు  
జగన్ కు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ ను విమర్శించే అర్హత లోకేశ్ కు లేదని అన్నారు. చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడిగా తప్ప లోకేశ్ కు ఇతర అర్హత ఏముందని ప్రశ్నించారు. డైలాగులు మాట్లాడటం కాదని, దమ్ముండాలని అన్నారు. రాజారెడ్డి మీసంలోని వెంట్రుకకు కూడా లోకేశ్ సరిపోడని చెప్పారు. వడ్డీతో సహా లోకేశ్ ఏం చెల్లిస్తాడని ప్రశ్నించిన అంబటి... హెరిటేజ్ కంపెనీలో అప్పు చెల్లిస్తాడా? అని ఎద్దేవా చేశారు.

తప్పు చేసిన వారిని కోర్టులో నిలబెడతామని... ముగ్గురి అరెస్టే దీనికి తొలి అడుగని అంబటి అన్నారు. అన్ని ఆధారాలతో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. దొంగల ముఠాకు చంద్రబాబు నాయకుడని విమర్శించారు. చంద్రన్న కానుక, ఫైబర్ నెట్, రాజధాని భూముల వ్యవహారాలలో ఎంత మంది జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందోనని అన్నారు.

జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ... ఆయన ఒక తేడా మనిషని చెప్పారు. ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారని... ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.


More Telugu News