ఆనంద గజపతిరాజుకు మేమే నిజమైన వారసులం: సుధ, ఊర్మిళ గజపతిరాజు

  • చెన్నైలోని ఆస్తి విషయంలో సుధా గజపతి రాజుపై ఫోర్జరీ కేసు
  • నోటీసులు అందడంతో లండన్ నుంచి విశాఖకు
  • 1991లోనే సంచయిత తల్లి విడాకులు తీసుకున్నారన్న ఊర్మిళ
పూసపాటి ఆనంద గజపతిరాజు వారసులం తామేనని, వారసత్వ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామంటూ ఆయన భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనమయ్యాయి. సంచయిత అసలు వారసురాలు కానే కారని పేర్కొన్నారు. ఆనంద గజపతిరాజు వారసురాలినని చెప్పుకుంటున్న ఆమె అందుకు సంబంధించి ఒక్క ఆధారాన్నైనా చూపించగలరా? అని వారు ప్రశ్నించారు.

చెన్నైలోని ఓ ఆస్తి విషయంలో తాము సంతకాలు ఫోర్జరీ చేశామంటూ గతేడాది మేలో సంచయిత తమపై విశాఖలో కేసు పెట్టారని, తమకు నోటీసులు అందడంతో లండన్ నుంచి ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. సంచయిత తల్లి ఉమా గజపతిరాజు 1991లోనే ఆనంద గజపతి నుంచి విడాకులు తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆస్తి పంపకాలు కూడా పూర్తయ్యాయని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆస్తులన్నీ తమకే చెందేలా తన తండ్రి స్వహస్తాలతో వీలునామా రాశారని ఊర్మిళ తెలిపారు.

కాగా, సంచయితకు దక్కిన ఆస్తులను ఆమెకు వివాహం కాకుండా విక్రయించకూడదన్న విషయం పత్రాల్లో స్పష్టంగా రాసి ఉందని, కానీ ఇప్పడా విషయాన్ని పక్కనపెట్టి ఆస్తుల్ని విక్రయించడం చట్ట విరుద్ధమని హైకోర్టు న్యాయవాది హరికృష్ణ తెలిపారు. అంతేకాదు, చెన్నైలో జరిగిన ఘటనను విశాఖలో జరిగినట్టు చెప్పి కేసు పెట్టారని ఆయన వివరించారు.


More Telugu News