తొలి రోజు బేరాల్లేక 'బేర్'మన్న మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు!

  • నిన్న తెరచుకున్న వాణిజ్య సముదాయాలు
  • కనీసం సాధారణ స్థాయిలో జరగని వ్యాపారం
  • పరిస్థితి మారుతుందన్న నమ్మకంలో యాజమాన్యాలు
లాక్ డౌన్ కారణంగా రెండున్నర నెలలకు పైగా మూతపడిన మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు సోమవారం నాడు తిరిగి తెరచుకోగా, తొలి రోజున కస్టమర్లు చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చారు. వారి వ్యాపారాలు సాధారణ స్థాయిలో కాదుకదా... కనీస స్థాయిలో కూడా జరగలేదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాపార సముదాయాలు జనతా కర్ఫ్యూ రోజు నుంచి మూతపడిన సంగతి తెలిసిందే.

అన్ లాక్ 1.0లో భాగంగా నిన్న చాలా ప్రాంతాల్లో బడా మాల్స్, రెస్టారెంట్లు, ఆతిథ్య గృహాలు తెరచుకున్నాయి. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను వాడుతూ కస్టమర్లను అనుమతించినా, చాలా ప్రాంతాల్లో వేళ్లపై లెక్కించే స్థాయిలోనే కస్టమర్లు కనిపించారు. కరోనా వ్యాప్తి భయం ప్రజల్లో ఉన్నందునే జనసమ్మర్థం అధికంగా ఉంటుందని భావించి, తొలి రోజున కస్టమర్లు దూరంగా ఉన్నారని నిపుణులు అంచనా వేశారు.

ఇక ఇప్పటికిప్పుడు తమ మాల్స్ కిక్కిరిసిపోతాయని భావించడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. కొనుగోళ్లు కూడా భారీగా ఉంటాయని అనుకోవడం లేదని, పరిస్థితి నిదానంగానైనా మారుతుందని హైదరాబాద్ లోని ఓ మాల్ లో బ్రాండెడ్ షోరూం నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, చాలా మాల్స్ కు వచ్చిన కస్టమర్ల ఫోన్ నంబర్, ఆధార్ కార్డు వివరాలను అక్కడి వారు నమోదు చేసుకున్నారు. కొన్ని చోట్ల వాటి జిరాక్స్ లను కూడా సేకరించారని తెలుస్తోంది.


More Telugu News