క్రీడా పురస్కారాలకు క్రికెటర్లను నామినేట్ చేసిన బీసీసీఐ

  • రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ పేరు ప్రతిపాదన
  • అర్జున పురస్కారానికి ఇషాంత్, ధావన్, దీప్తిశర్మ నామినేట్
  • 2020 ఏడాదికి ప్రతిపాదనలు కోరిన కేంద్రం
దేశంలోని ఉన్నతస్థాయి క్రీడా పురస్కారాలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తమ క్రికెటర్లను నామినేట్ చేసింది. అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు రోహిత్ శర్మను నామినేట్ చేసింది. శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ దీప్తి శర్మల పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదించింది. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడల శాఖ ఆయా క్రీడా సంఘాల నుంచి ప్రతిపాదనలు కోరింది.

ఇక, రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్ రత్న ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో రోహిత్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే వరల్డ్ కప్ ఈవెంట్ లో ఐదు సెంచరీలు బాది రికార్డు నెలకొల్పాడు.

ఇక, ధావన్, ఇషాంత్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు విశేషంగా సేవలు అందిస్తున్నారు. మహిళల జట్టులో దీప్తి శర్మ అగ్రశ్రేణి ఆల్ రౌండర్ గా ఎదుగుతోంది. పిన్న వయసులోనే భారత మహిళల జట్టులో స్థానం సంపాదించుకున్న దీప్తి శర్మ మరెన్నో ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడగలదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News