కేంద్రం ప్రకటించిన తాజా సడలింపులు, మార్గదర్శకాలు ఇవే!

  • లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
  • సడలింపులతో తాజా మార్గదర్శకాలు జారీ
  • కంటైన్మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు
దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రాకపోయినా, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కంటైన్మెంట్ జోన్లను పరిగణనలోకి తీసుకుని దేశంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం, కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఊరట కలిగించేలా అనేక సడలింపులు ప్రకటించింది. వీటిని మూడు దశలుగా విభజించింది.

తొలి దశ సడలింపులు (జూన్ 8 తర్వాత ప్రారంభమయ్యేవి)

  • మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు
  • హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, ఇతర ఆతిథ్య ప్రదేశాలు
  • షాపింగ్ మాళ్లు
వీటిలో విధంగా భౌతికదూరం నిబంధనలు పాటించడంతో పాటు కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూత్రాలను అమలు చేయాల్సి ఉంటుంది.

రెండో దశ

స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చల అనంతరం పునఃప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, భాగస్వాములతోనూ చర్చించాల్సి ఉంటుంది. దీనిపై వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం వెలువడుతుంది.

మూడో దశ

పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకునే కొన్ని అంశాలను మూడో దశలో చేర్చారు.
  • అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
  • మెట్రో రైళ్లు
  • సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టయిన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు.
  • సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతి, మతపరమైన కార్యకలాపాలు, వేడుకలు, ఇతర భారీ సభా సమావేశాలు.

రాత్రి వేళ కర్ఫ్యూ

కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. అయితే నిత్యావసరాల కోసం మినహాయింపు ఉంటుంది. దీనిపై స్థానిక అధికార యంత్రాంగం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.

లాక్ డౌన్

  • కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ జూన్ 30 వరకు తప్పనిసరిగా అమల్లో ఉంటుంది.
  • కంటైన్మెంట్ జోన్ పరిధిని నిర్ణయించే అధికారం జిల్లా యంత్రాంగానికి అప్పగింత.
  • కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసరాలకు, అత్యవసర వైద్య సేవలకే మినహాయింపు
  • కేసులు తరచుగా నమోదయ్యే బఫర్ జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేసే బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విచక్షణాధికారాలు

  • అంతర్రాష్ట్ర, రాష్ట్రం లోపల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇది వ్యక్తులకైనా, సరకు రవాణాకైనా వర్తిస్తుంది. అయితే, దీనిపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో నిర్ణయం తీసుకోవచ్చు.
  • ప్రయాణికుల రైళ్లు, శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడం, విదేశీయుల తరలింపు కొనసాగుతుంది.
ఆరోగ్య హెచ్చరికలు

65 ఏళ్ల పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భవతులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటి వద్దే ఉండాలి. నిత్యావసరాలు, ఆరోగ్య కారణాల రీత్యా తప్ప మరి దేనికీ బయటికి రాకూడదు.
ఆరోగ్య సేతు యాప్
  • ఆఫీసులు, కార్యక్షేత్రాల్లో ఉద్యోగులు విధిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. వారు ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడంపై యాజమాన్యాలు శ్రద్ధ చూపాలి.
  • ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ కలిగివుండేలా జిల్లా అధికార యంత్రాంగాలు ప్రోత్సహించాలి.

మార్గదర్శకాలపై హెచ్చరిక

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం కూడా పరిధిని దాటి మార్చరాదు. అన్ని జిల్లాల యంత్రాంగాలు మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలి. వ్యక్తులు ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005కు అనుగుణంగా కఠిన చర్యలు ఉంటాయి.


More Telugu News