ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది!: అంబటి రాంబాబు

  • గ్యాస్ లీకేజ్ బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?
  • విశాఖకు ఆయన ఎందుకు రాలేదు?
  • మా ప్రభుత్వంపై  బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు
విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమతో వైసీపీ ప్రభుత్వం లాలూచీ పడిందంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ సంస్థతో లాలూచీ పడింది చంద్రబాబేనని, టీడీపీ హయాంలో సింహాచలం ఆలయ భూములను ఎల్జీ పాలిమర్స్ కు ఇచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

విశాఖ ఘటనలో బాధితులకు ముఖ్యమంత్రి కనీవినీ ఎరుగని రీతిలో సాయం చేశారని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభిస్తే, టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అని, ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విశాఖలో ఇంత ఘోరం జరిగితే బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు ఎందుకు రాలేదు?  విశాఖకు చంద్రబాబు వచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందో? లేదో?నని, ఆ విషయాన్ని చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. నాడు టీడీపీ హయాంలో గోదావరి పుష్కరాలప్పుడు ప్రమాద ఘటనకు కారణమైన వారిని ఎంతమందిని చంద్రబాబు అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. నాడు గెయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగితే బాధితులకు నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి కేవలం రూ.3 లక్షల చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు.


More Telugu News