రుణాలు తీసుకున్న వారికి శుభవార్త... మరో మూడు నెలల మారటోరియం!

  • మే 31తో ముగియనున్న మారటోరియం
  • ఇంకా కొనసాగుతూనే ఉన్న లాక్ డౌన్
  • ఎంఎస్ఎంఈలకు నిలిచిపోయిన ఆదాయం
  • మరోమారు మారటోరియంను పొడిగించాలని వినతులు
  • అతి త్వరలో ఆర్బీఐ నిర్ణయం తీసుకునే అవకాశం
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రకటించిన లాక్ డౌన్ ను మరోమారు కేంద్రం పొడిగించిన వేళ, ఆర్థిక వ్యవస్థ మరింత అతలాకుతలం కాకుండా చూసేందుకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు ఇబ్బందుల్లో కూరుకుపోకుండా చూసేందుకు ఆర్బీఐ మరింత ఉపశమనాన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన మూడు నెలల మారటోరియాన్ని, మరో మూడు నెలల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

రుణ గ్రహీతలకు ఇచ్చిన మారటోరియం సదుపాయాన్ని మరో 90 రోజులు కొనసాగించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో పాటు పలు విభాగాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విన్నవించాయి. వీటిపై సమీక్షించిన ఆర్బీఐ, మే 31తో ముగియనున్న మారటోరియం వ్యవధిని, ఆగస్టు వరకూ పొడిగించేలా నిర్ణయం తీసుకునే యోచనలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంక్‌ అధినేతలతో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ భేటీ కాగా, వృద్ధి బాటలో కుదేలైన వివిధ రంగాలకు మరింత ఊతం ఎలా ఇవ్వాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.

దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతూ ఉంటే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆదాయం రాదని, అటువంటి సమయంలో వారు నెలవారీ కిస్తీలు, పాత రుణాలు చెల్లించాలని ఒత్తిడి పెట్టడం మంచిది కాదని, పలువురు సూచించినట్టు తెలిపారు. ఆర్బీఐ తీసుకున్న ద్రవ్యపరమైన చర్యల అమలు, ఆర్థికరంగంపై ఒత్తిడి తగ్గించేందుకు ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించిన ఆర్బీఐ, మారటోరియం పొడిగింపుపై అతి త్వరలోనే తన నిర్ణయాన్ని వెలువరించనుందని తెలుస్తోంది.


More Telugu News