రేపు విజయవాడ నుంచి బల్హార్షాకు రెండు రైళ్లు బయలుదేరతాయి: కృష్ణబాబు

  • వలస కూలీల కోసం ‘స్పందన’ లో ఆన్ లైన్ యాప్  
  •  అన్ని రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడుతున్నాం
  • మహారాష్ట్ర వలస కూలీలను రేపు వారి స్వస్థలాలకు పంపుతాం
వలస కూలీల కోసం స్పందన వెబ్ సైట్ లో ఆన్ లైన్ యాప్ సిద్ధం చేశామని ఏపీ కోవిడ్ స్టేట్ లెవల్ కో-ఆర్డినేటర్ కృష్ణ బాబు తెలిపారు. వలస కూలీలు తమ వివరాలను spandana.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వారు ఉంటున్న ప్రాంతం, వెళ్లే ప్రాంతం తెలపాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్ లు, కంట్రోల్ రూమ్ లతో మాట్లాడుతున్నామని, ఏపీకి రావాలనుకుంటున్న వారికి ఏర్పాట్లు చేయాలని కోరినట్టు చెప్పారు. వలస కూలీలను తరలించే శ్రామిక్ రైళ్లు మధ్యలో ఎక్కడా ఆగవని, ఈ  రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని తెలిపారు. మహారాష్ట్ర వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని, రేపు విజయవాడ నుంచి బల్హార్షాకు రెండు రైళ్లు బయలుదేరతాయని పేర్కొన్నారు.

పాసులు, అనుమతి ఉన్న వలస కూలీలనే రైళ్లలో తరలిస్తామని వివరించారు. వలస కూలీల కోసం భువనేశ్వర్, ఢిల్లీ, గోరఖ్ పూర్, పాట్నా, భోపాల్ కు రైళ్లు పంపిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన 5,500 మంది కూలీలు, ఒడిశాకు చెందిన1,925 మంది కూలీలు ఏపీలో ఉన్నారని, రాజస్థాన్ మౌంట్ అబూలో 600 మంది ఏపీ వాసులు, తమిళనాడులో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


More Telugu News