పొగాకు రైతులకు శుభవార్త: జీవీఎల్

  • పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడి
  • కేంద్రం నుంచి భరోసా వచ్చిందంటూ ట్వీట్
  • రెడ్ జోన్ లో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పొగాకు రైతులకు శుభవార్త అంటూ ట్వీట్ చేశారు. పొగాకు బోర్డు వేలం కేంద్రాలు వెంటనే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతూ, కేంద్ర వాణిజ్య కార్యదర్శి అనూప్ వాధ్వాన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడానని వెల్లడించారు. పొగాకు కొనుగోళ్లు జరిపేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని వారిద్దరూ భరోసా ఇచ్చారని జీవీఎల్ పేర్కొన్నారు. అంతేకాదు, తన ట్వీట్ కు ఓ ఆంగ్ల మీడియా సంస్థలో వచ్చిన వార్తను కూడా జతచేశారు.

ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఆలస్యం అవుతోందన్నది ఆ వార్త సారాంశం. కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పలు చోట్ల రెడ్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేసినందున పొగాకు వేలం ప్రక్రియ ముందుకు కదల్లేదని ఆ వార్తలో పేర్కొన్నారు. పొగాకు వేలం కేంద్రాలు ఉన్న ఒంగోలు, టంగుటూరు, కందుకూరు తదితర ప్రాంతాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయని వివరించారు. వాస్తవానికి ఏప్రిల్ 20న వేలం నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం పొగాకు కొనుగోళ్లపైనా పడింది.


More Telugu News