తనకు ఏదైనా అయితే... పాలనా పగ్గాలు చెల్లెలు చేతికే... ముందే ఏర్పాట్లు చేసిన కిమ్ జాంగ్ ఉన్!

  • శస్త్రచికిత్సకు రోజుల ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
  • గత సంవత్సరం తొలగించిన సోదరిని తిరిగి నియమించిన కిమ్
  • ఆపై కీలక బాధ్యతల అప్పగింత
  • ఇప్పుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ వైపు అందరి చూపు
ఆపరేషన్ సమయంలో అనుకోని పరిస్థితుల్లో తనకు ఏదైనా జరిగితే, దేశ పాలనా పగ్గాలు మరొకరి చేతుల్లోకి వెళ్లకుండా ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ ముందుగానే ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. గత సంవత్సరం అమెరికాతో జరిగిన సమ్మిట్ లో ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని భావిస్తూ, పదవి నుంచి తొలగించిన తన సోదరి కిమ్ యో జాంగ్ ను, ఆయన శస్త్రచికిత్సకు ముందు జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో తిరిగి మంత్రివర్గంలో నియమించారు. తనతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే చోటున్న సెంట్రల్ కమిటీలోని నిర్ణయాధికార కమిటీలో ప్రత్యామ్నాయ సభ్యురాలిగా కూడా ఆమెకు స్థానం కల్పించారు.

సాధారణంగా ఒకరిని పదవి నుంచి తొలగిస్తే, మరోసారి వారికి తిరిగి అదే పదవిని కట్టబెట్టేందుకు కిమ్ అంగీకరించరు. కానీ తన సోదరి విషయంలో మాత్రం ఆయన మనసు మార్చుకున్నారు. కిమ్ సామ్రాజ్యాన్ని కొనసాగించాలన్న ఆలోచనతోనే యో జాంగ్ ను తిరిగి తెరపైకి తెచ్చారని నిపుణులు అంచనా చేస్తున్నారు.

"గత సంవత్సరం ఆగస్టు నుంచే కిమ్ గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. దేశంలోని పవిత్రమైన పర్వతం పెక్టూను పదే పదే ఎక్కిదిగడం కూడా ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపింది" అని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని నార్త్ కొరియా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దానికి తోడు కేవలం 31 సంవత్సరాల వయసులోనే అతిగా సిగరెట్లకు అలవాటుపడడం కూడా కిమ్ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.

ఇప్పుడు ఒకవేళ కిమ్ మరణిస్తే, నార్త్ కొరియాలో అధికారం ఎవరి చేతుల్లోకి వెళుతుందన్న విషయమై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నార్త్ కొరియాలో వారసుల ఎంపిక ముందు నుంచే జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే తన సోదరి వైపే కిమ్ మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇక కిమ్ తరువాత నార్త్ కొరియా ఎవరి చేతుల్లోకి వెళుతుందో ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదని, అయితే, కిమ్ కుటుంబ సామ్రాజ్యం మాత్రం అంతరించబోదని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఆండీ జాక్సన్ గతంలోనే వ్యాఖ్యానించారు.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియాను స్ధాపించిన కిమ్ ఇల్ సున్, 1994లో మరణించిన అనంతరం ఆయన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ కు పాలనా పగ్గాలు దక్కాయి. ఆపై 2011లో కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 2017లో కిమ్ పెద్ద సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మలేషియాలో జరిగిన కెమికల్ దాడిలో మరణించారు. అంతకుముందు 2013లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ వాడి, కిమ్ మేనమామ జాంగ్ సాంగ్-తహేక్ ను హత్య చేశారు.

కిమ్ తరువాత అతని బంధువుల్లో ఒకరైన వ్యక్తే అధ్యక్షుడు అవుతారని, మరో వ్యక్తిని ఊహించలేమని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శిటీ రీసెర్చర్ బేట్స్ గిల్ అంచనా వేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పార్టీ సభ్యులు, మంత్రులు, ప్రజల సెంటిమెంట్ తదితరాలను విశ్లేషిస్తున్న అత్యధికులు, కిమ్ సోదరే అధ్యక్షురాలు అవుతుందని అంటున్నారు. ఈ ఉద్దేశంతోనే హార్ట్ సర్జరీకి రోజుల ముందు ఆమెను పదవిలోకి తీసుకుని వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.


More Telugu News