గాలికి ఎగిరి వచ్చిన కరెన్సీ నోట్లు.. కరోనా భయంతో తీసుకునేందుకు జంకిన ప్రజలు!

  • ఏటీఎం నుంచి తెచ్చిన నోట్లను శుభ్రపరిచిన మహిళ
  • గాలికి రూ.500 నోట్లు రోడ్డుపై పడిన వైనం
  • కరోనా భయంతో నోట్లను తాకని ఢిల్లీ వాసులు
  • నోట్లను సొంతదారుకు అప్పగించిన పోలీసులు
కరెన్సీ నోట్లను తాకడం వల్ల కూడా కరోనా సోకే అవకాశం వుందంటూ ప్రచారం జరగడం తెలిసిందే. ప్రజల్లోనూ దీనికి సంబంధించిన చైతన్యం క్రమంగా పెరుగుతోందనడానికి ఢిల్లీలో జరిగిన ఓ సంఘటనే అందుకు నిదర్శనం. రోడ్డుపై మూడు రూ.500 నోట్లు కనిపిస్తున్నా ఒక్కరూ వాటిని తీసుకోవడానికి సాహసించలేదు.

ఉత్తర ఢిల్లీలోని లారెన్స్ రోడ్ లోని ఓ ఇంటి ఎదుట పెళపెళలాడే ఐదు వందల రూపాయల కాగితాలు కిందపడి ఉండడాన్ని మొదట ఓ వ్యక్తి గమనించాడు.  ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు కూడా ఆసక్తిగా వాటిని చూస్తున్నారే తప్ప వాటి దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. చివరికి ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా వెంటనే ఆ నోట్ల వద్దకు వెళ్లలేదు. ఓ పోలీసు చేతి తొడుగులు ధరించి ఆ నోట్లను తీసుకుని వాటిని శానిటైజర్ తో శుభ్రపరిచాడు. ఆపై వాటిని ఓ కవర్ లో ఉంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత చరణ్ జీత్ కౌర్ అనే మహిళ వచ్చి ఆ నోట్లు తనవేనని చెప్పింది.

చరణ్ జీత్ కౌర్ ఓ టీచర్. ఆమె ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేసి, కరోనా భయంతో వాటిని శానిటైజర్ తో శుభ్రపరిచి బాల్కనీలో ఆరబెట్టింది. అయితే గాలికి కొన్ని నోట్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఆ నోట్లనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చరణ్ జీత్ వద్ద ఉన్న మిగిలిన నోట్ల సిరీస్ తో ఆ మూడు నోట్లు సరిపోలడంతో వాటిని ఆమెకే ఇచ్చివేశారు.


More Telugu News