వాసన, రుచి రెండూ చూడలేకపోయా: అహ్మదాబాద్ కరోనా బాధితురాలు

  • అహ్మదాబాద్ లో రెండో కరోనా పేషెంట్ సుమితి సింగ్
  • ఫిన్లాండ్ నుంచి వచ్చిన తర్వాత బయటపడ్డ కరోనా లక్షణాలు
  • 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'తో అనుభవాలను పంచుకున్న స్మృతి 
ఆమె పేరు సుమితి సింగ్. అహ్మదాబాద్ లో రెండో కరోనా పేషెంట్. కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన మహిళ. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'లో తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఆమె అనుభవాలను ఆమె మాటల్లోనే చూద్దాం.

'ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఫిన్లాండ్ నుంచి తిరిగొచ్చా. ఇండియాకు వచ్చిన తర్వాత కొంచెం జ్వరం రావడంతో నా గదిలోనే సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండిపోయా. వాతావరణ మార్పు వల్లే జ్వరం వచ్చిందని భావించిన మా ఫ్యామిలీ డాక్టర్ యాంటీబయోటిక్స్ వాడమని సూచించారు. అయితే నేను వాటిని తీసుకోలేదు' అని సుమితి  తెలిపారు.

మరోవైపు సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్న సుమితి ... తన కుటుంబ సభ్యులను ఎవరినీ తన గదిలోకి అనుమతించలేదు. ఆహారాన్ని కూడా గది బయట ఉన్న టేబుల్ పైనే ఉంచమని చెప్పేది. ఆహారాన్ని తీసుకున్న వెంటనే పాత్రలన్నింటినీ ఆమే శుభ్రంగా కడిగి ఇచ్చేసేది. అయితే, ఆమె పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దగ్గు ప్రారంభమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పిగా అనిపించింది. వెంటనే స్వయంగా డ్రైవ్ చేస్తూ ఆమె వాహనంలో ఆసుపత్రికి వెళ్లింది. ఎలాంటి సమస్య లేదనే నమ్మకంతోనే ఆమె ఉంది. అయితే, రెండు రోజుల తర్వాత  ఆమెకు కరోనా సోకిందని పరీక్షల్లో నిర్ధారణ అయింది. అహ్మదాబాద్ లో రెండో కరోనా పేషెంట్ అని వైద్యులు ఆమెకు తెలిపారు.

'ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. అయినా కరోనా సోకింది. ఎంతో భయం వేసింది. నా కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ అంటించానా? అని ఆందోళనకు గురయ్యా' అని సుమితి తెలిపింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్ కు తరలించారు.

'తొలి రెండు రోజులు భయంగానే అనిపించింది. వాసన, రుచిని కూడా గుర్తించలేకపోయా. కానీ డాక్టర్లు, నర్సులు విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షిస్తూ, ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. 11 రోజుల తర్వాత టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా. నా కుటుంబ సభ్యులను చూసేందుకు ఇంటి గేటు నుంచి లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు... కుటుంబ సభ్యులతో పాటు అందరూ చప్పట్లు కొడుతూ, ఆహ్వానించారు' అని సుమితి తెలిపింది.


More Telugu News