కరోనాపై ప్రపంచానికి చైనా తప్పుడు సమాచారం ఇచ్చింది: అమెరికా మంత్రి విమర్శలు

  • వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడే మా దేశ వైద్య బృందానికి అనుమతివ్వలేదు
  • మా దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నిక్కచ్చిగా పని చేయడం లేదన్న మంత్రి పాంపియో
చైనా ప్రభుత్వంపై అమెరికా మంత్రి మైక్ పాంపియో తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పుడే తమ దేశ వైద్య బృందానికి అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనికి చైనా ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని అన్నారు.

కరోనా వైరస్ వుహాన్‌లోనే పుట్టిందని అందరికీ తెలుసని, అక్కడే ప్రయోగశాల ఉన్నప్పుడు తమ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని చైనాను ప్రశ్నించారు. ఈ వైరస్ గురించి అమెరికాకు తెలియని సమాచారం ఇంకా ఎంతో ఉందన్నారు. ఈ మహమ్మారి కారణంగా  అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ పతనమైందని పాంపియో చెప్పారు.

వైరస్ విషయంలో చైనా నుంచి తమకు ఇప్పుడు సమాధానం కావాలన్నారు. ‘వైరస్ వుహాన్‌లో  పుట్టిందన్నది నిజం. అలాంటప్పుడు ఏ ప్రభుత్వమైనా తమ దేశంలో ఏం జరుగుతుందో చెప్పాలి. కరోనా స్థితిని వివరించాలి. ఎన్ని కేసులు నమోదయ్యాయి?  ఎంతమంది చనిపోయారు? ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు? అనే విషయాలు అందరికీ తెలియజేయాలి. కానీ,  చైనా అధ్యక్షుడు మాత్రం ఇవేవీ చెప్పకుండా... ఈ వైరస్ అమెరికా సైనికులు లేదా అమెరికా ఆయుధ ప్రయోగశాల సృష్టి అంటున్నారు. ప్రపంచానికి తప్పుడు సమాచారం చెప్పింది. మా దేశ ప్రజల ఆరోగ్యం, వారి జీవన శైలికి ముప్పు తీసుకొచ్చింది’ అని పాంపియో దుయ్యబట్టారు.

అలాగే, ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కర్తవ్యాన్ని నిక్కచ్చిగా నెరవేర్చాలని పాంపియో అన్నారు. ప్రపంచానికి ఎప్పుడూ సరైన, సమర్థమైన, నిజమైన సమాచారం ఇవ్వాల్సిన సంస్థ, ఆ పని చేయలేదని ఆరోపించారు. అన్ని దేశాలను అప్రమత్తం చేయడంలో అది విఫలమైందన్నారు. అమెరికన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సంస్థకు ఒక్క డాలర్ కూడా ఇవ్వమని హెచ్చరించారు.


More Telugu News