చంకలో నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి ఏపీ ఐఏఎస్‌ సృజన.. 'మీరు చాలా గ్రేట్ మేడమ్' అంటోన్న నెటిజన్లు

  • విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ నిబద్ధతకు సెల్యూట్
  • సృజనపై కేంద్రమంత్రి షెకావత్ ప్రశంసలు
  • ఇది తన బాధ్యత అంటున్న అధికారిణి
  • కరోనా నేపథ్యంలో సెలవులు వినియోగించుకోని ఐఏఎస్ సృజన
నెల రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చారు ఓ ఐఏఎస్ అధికారిణి.. తనకున్న సెలవులను కూడా వాడుకోకుండా కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి బిడ్డను ఎత్తుకుని కార్యాలయానికి వస్తున్నారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ సృజన గుమ్మళ్ళ విధి నిర్వహణలో చూపిస్తోన్న నిబద్ధతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  

కరోనా విజృంభణ సమయంలో విధులు నిర్వహించడం ఓ మనిషిగా ఇది తన బాధ్యతని ఆమె చెప్పారు. తాను తిరిగి విధుల్లో చేరితే తమ పరిపాలన విభాగానికి కాస్త సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. ఈ సమయంలో అందరూ కలిసి పని చేస్తే ఈ పోరులో మరింత బలం చేకూరుతుందని ఆమె అంటున్నారు. ఆమె 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందని అధికారిణి.  

'కరోనాపై పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టం. పని పట్ల నిబద్ధత చూపుతూ అటువంటి యోధులకు ఓ ఉదాహరణగా నిలుస్తోన్న ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ట్వీట్ చేశారు.  

ఈ సందర్భంగా ఆ ఐఏఎస్‌ అధికారిణి ఫొటోను కూడా పోస్ట్ చేశారు. తనకున్న ఆరు నెలల ప్రసూతి సెలవులను రద్దు చేసుకుని మరీ ఆమె విధుల్లో చేరడం పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'మీరు చాలా గ్రేట్ మేడమ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనవసరంగా సెలవులు పెట్టి ఇంట్లో ఉండే అధికారులు ఆమెను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.


More Telugu News