జీవితం ఇంతకు ముందులా ఉండకపోవచ్చు: ప్రధాని మోదీ

  • లాక్‌డౌన్  ఎత్తివేత కుదరకపోవచ్చు
  • సామాజిక మార్పు జరగాల్సి ఉంది
  • ప్రతిపక్ష నేతల వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ
ఇకపై జీవితం కరోనాకు ముందు, కరోనా తర్వాతలా ఉండే అవకాశం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడున్నట్టుగా ఇకపై జీవితం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్యనేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి వున్నాయని పేర్కొన్న ప్రధాని.. లాక్‌డౌన్ ఎత్తివేత కుదరకపోవచ్చన్నారు.

కాగా, కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యల గురించి కేంద్ర వైద్య, హోం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఆయా పార్టీల నేతలకు వివరించారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరతకు సంబంధించిన అంశాన్ని ఈ సమావేశంలో నేతలు ప్రస్తావించారు. అలాగే, పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపివేయాలని మరికొందరు నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టీఆర్ఎస్, వైసీపీ, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, లోక్‌ జన్‌శక్తి పార్టీ, డీఎంకే, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ యునైటెడ్, బిజూ జనతాదళ్, శివసేన నేతలు పాల్గొన్నారు.


More Telugu News