ఇళ్ల వద్దకే నిత్యావసరాలు అందించేందుకు చేతులు కలిపిన డొమినోస్, ఐటీసీ ఫుడ్స్

  • దేశం మొత్తం లాక్ డౌన్
  • నిత్యావసరాల కోసం ప్రజల ఇబ్బంది
  • క్యాంబో ప్యాక్ తో ప్రజల అవసరాలు తీర్చేందుకు డొమినోస్, ఐటీసీ నిర్ణయం
భారత్ ప్రస్తుతం లాక్ డౌన్ లో మగ్గుతోంది. కరోనా మహమ్మారి ఉన్నట్టుండి తీవ్రం కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. దాంతో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాల కోసం పడుతున్న ఇబ్బందులు గమనించిన డొమినోస్ పిజ్జా, ఐటీసీ ఫుడ్స్ సంస్థలు చేతులు కలిపాయి. ప్రజల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందించాలని ఈ వ్యాపార దిగ్గజాలు భావిస్తున్నాయి. 'డొమినోస్ నిత్యావసరాలు' పేరిట ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా ఆశీర్వాద్ ఆటా, ధనియాలు, కారం, పసుపు వంటి సరుకులను ఓ కాంబో ప్యాక్ గా అందిస్తారు.

దీనికి సంబంధించిన ఆర్డర్లు డొమినోస్ యాప్ ద్వారా బుక్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ డొమినోస్ నిత్యావసరాలు పథకాన్ని బెంగళూరు నగరంతో ప్రారంభించనున్నారు. ఆపై హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్ కతా, నోయిడాల్లో అమలు చేస్తారు. వినియోగదారులు ఈ సౌకర్యం కోసం డొమినోస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ లో డొమినోస్ ఎసెన్షియల్స్ అనే విభాగంలో డిజిటల్ చెల్లింపుల రూపంలో తమ ఆర్డర్డు నమోదు చేయాలి. డొమినోస్ పిజ్జా సంస్థకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పటిష్టమైన డెలివరీ వ్యవస్థ ఉంది. ఇది తమకెంతో లాభిస్తుందని డొమినోస్, ఐటీసీ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.


More Telugu News