అది తప్పుడు ప్రచారం...కరోన సోకిన గూగుల్ ఉద్యోగి భార్య పారిపోలేదు : కర్ణాటక ప్రభుత్వం వివరణ

  • భర్తకు వైరస్ సోకిందని తెలియక ముందే ఆమె ఆగ్రా వెళ్లారు 
  • వైరస్ సోకిందని తెలిసాక ఆమెను వెతికి పట్టుకున్నారు
  • వివరణ ఇచ్చిన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ

భర్తకు కరోనా సోకిందని తెలిసి బెంగళూరు గూగుల్ ఉద్యోగి భార్య ఆగ్రాకు పారిపోయిందంటూ వచ్చిన వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, ఇలా జరిగిన తప్పుడు ప్రచారం వల్ల ఆ కుటుంబం ఆవేదన చెందుతోందని కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వివరణ ఇచ్చారు. హానీమూన్ కోసం ఐరోపా దేశాలకు వెళ్లి వచ్చిన గూగుల్ ఉద్యోగి దంపతులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. భర్తకు వైరస్ సోకిందని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, ఈ సమాచారంతో ఆగ్రా వైద్యులు అక్కడ ఆమెను పట్టుకుని వైద్యం చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని పై మంత్రి వివరణ ఇచ్చారు.

'వీరికి నెల రోజుల క్రితమే పెళ్లయింది. హానీమూన్ కు యూరప్ వెళ్లారు. పలు దేశాల్లో తిరిగి మార్చి 8న ముంబయి చేరుకున్నారు. అక్కడి నుంచి అదేరోజు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి 1.50 గంటలకు టెకీ భార్య బెంగళూరులో విమానం ఎక్కింది.మరునాడు ఉదయం ఢిల్లీ చేరుకుంది.

మార్చి 9న ఉద్యోగానికి వెళ్లిన భర్తకు అస్వస్థత చేయడంతో వైద్య పరీక్షలు జరిగాయి. అతనికి వైరస్ సోకినట్టు ఈనెల 12వ తేదీన రిపోర్టులు వచ్చాయి. ఆమె ఢిల్లీ వెళ్లేటప్పటికి భర్త బాగానే ఉన్నాడని, ఆ తర్వాతే అతనికి వైరస్ సోకిందని తేలిందని, అందువల్ల ఆమె పారిపోయిందనడం తప్పే' అని మంత్రి వివరించారు.

'యూరోప్ టూర్ నుంచి వచ్చిన ఆమె ముంబయి నుంచి భర్తతోపాటు బెంగళూరు వచ్చి, ఇంటికి వెళ్లకుండా విమానాశ్రయం నుంచే తిరిగి ఢిల్లీకి ఎందుకు వెళ్లిందన్నదాని పై సరైన వివరాలు లేవు. బహుశా భర్తకు బెంగళూరులో సెండాఫ్ ఇచ్చి పుట్టింటికి వెళ్లాలని ఆమె అనుకుని ఉండవచ్చు' అంటూ మంత్రి తెలిపారు.

గూగుల్ టెకీకి   ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని, అతని భార్యకు కూడా కరోనా సోకినట్టు ప్రాథమిక పరీక్షల ద్వారా నిర్ధారించినా తుది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు.  ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు యూపీ ప్రభుత్వం ఇంకా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. 



More Telugu News