రాజీవ్ హత్యకేసు దోషి నళిని పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు!

  • నళిని సహా ఏడుగురిని విడుదల చేయాలంటూ రాష్ట్రమంత్రి వర్గ తీర్మానం
  • ప్రతిపాదనను పెండింగులో పెట్టిన గవర్నర్
  • గవర్నర్‌ను ఆదేశించలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి నళినికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. నళిని సహా ఈ కేసులో దోషులైన ఏడుగురిని విడుదల చేయాలంటూ గతేడాది సెప్టెంబరు 9న రాష్ట్రమంత్రి వర్గం నిర్ణయించింది.

అనంతరం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ పరిశీలన కోసం ఈ ప్రతిపాదనను పంపింది. అయితే, గవర్నర్ ఆ ప్రతిపాదనను పెండింగులో పెట్టారు. ఈ నేపథ్యంలో నళిని ఈ పిటిషన్ దాఖలు చేసింది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం తమను విడుదల చేయాలని, ఈ మేరకు గవర్నర్‌కు ఆదేశాలివ్వాలంటూ కోర్టును అభ్యర్థించింది.

పిటిషన్‌ను విచారణ సందర్బంగా కేంద్రం తరపున అదనపు  సొలిసిటర్‌ జనరల్‌ రాజగోపాల్‌, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది నటరాజన్‌, నళిని తరపున రాధాకృష్ణన్ హాజరై తమ వాదనలు వినిపించారు. మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని, రాష్ట్రాన్ని నడుపుతున్నది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కాదని నళిని తరపు న్యాయవాది వాదించారు.

గతంలో జయలలిత ఇటువంటి ప్రతిపాదనే చేశారని అయితే, అప్పుడు కేంద్రం నిరాకరించిందని అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది నటరాజన్ కూడా తన వాదనలను వినిపించారు. ముగ్గురి వాదనలు విన్న ధర్మాసనం.. నళిని చట్ట విరుద్ధంగా జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు తాము భావించలేమని, ఈ విషయంలో గవర్నర్‌ను ఆదేశించలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.


More Telugu News