ఇది మీ చేతగానితనమా కాదా? బీసీలంటే మీకు కక్ష... అవునా, కాదా?: చంద్రబాబు

  • బీసీ రిజర్వేషన్లు కాపాడలేకపోయారంటూ ఆగ్రహం
  • అమరావతి కేసుకు బ్రహ్మాండమైన లాయర్లను తీసుకువచ్చారంటూ వ్యాఖ్యలు
  • బీసీల కేసు కోసం ఎందుకు ఆ స్థాయి న్యాయవాదులను తీసుకురాలేదని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీ రిజర్వేషన్ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. 1987లో తాము బీసీలకు 27 రిజర్వేషన్ తీసుకువచ్చిన తర్వాత 33 ఏళ్ల పాటు బీసీలు ఆ ఫలాలను అనుభవించారని తెలిపారు. ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్ ఉండగా, 50 శాతం రిజర్వేషన్ కావాలంటూ కోర్టును ఆశ్రయించడంతో బీసీ రిజర్వేషన్ 24 శాతానికి పడిపోయే ప్రమాదం వచ్చిందని చంద్రబాబు వివరించారు. తద్వారా బీసీ రిజర్వేషన్లలో పది శాతం తరుగుదల నమోదవుతుందని తెలిపారు.

గత రిజర్వేషన్ల వల్ల 16 వేల మంది ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉందని, ఇప్పుడు అదంతా పోతుందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లిన రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి వైసీపీకి చెందినవాళ్లు కాదా? అని ప్రశ్నించారు. కావాలనే బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు.

"నేనడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని! ఇది మీ చేతగాని తనం కాదా? మీకు బీసీలపై ఉండే కక్ష.. అవునా, కాదా? 33 సంవత్సరాలు కాపాడిన రిజర్వేషన్లను మీరు కాపాడలేకపోయారంటే మిమ్మల్ని ఏమనాలి? బీసీ ద్రోహి అనాలా? బీసీల వ్యతిరేకి అనాలా? మీ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని అనాలా? అమరావతిపై వాదించేందుకు ఢిల్లీ నుంచి విమానంలో ముకుల్ రోహత్గీ వంటి బ్రహ్మాండమైన లాయర్లను తీసుకువచ్చారు. కానీ బీసీల విషయానికొచ్చేసరికి ఆ స్థాయి న్యాయవాదులను నియమించలేదు. మండలి రద్దు కోసం ఢిల్లీ వెళ్లి అందరినీ కలిశారు. కానీ బీసీల కోసం ఆ స్థాయిలో మీరు ప్రయత్నించలేదే! ఏదో ఒక తీర్పు ఇస్తే చాలు అనుకున్నారు" అంటూ మండిపడ్డారు.


More Telugu News