ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సీఎం జగన్, టీజీ వెంకటేశ్ మధ్య ఆసక్తికర చర్చ
- ఎమ్మెల్యే తనయుడి పెళ్లికి వెళ్లిన సీఎం జగన్
- ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన టీజీ వెంకటేశ్
- హైకోర్టు తరలింపుపై సీఎం జగన్ ను అడిగి తెలుసుకున్న వైనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ కర్నూలు జిల్లాకు విచ్చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు వచ్చిన ఆయన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి కోసం సీఎం జగన్ గన్నవరం నుంచి ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్వాగతం పలికారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. అనంతరం ఇద్దరూ ఎయిర్ పోర్టులో కాసేపు రాష్ట్ర పరిణామాలపై చర్చించుకున్నారు. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలిస్తామన్నారు, ఆ పనులు ఎంతవరకు వచ్చాయని టీజీ వెంకటేశ్ ప్రశ్నించగా, దీనిపై కేంద్రానికి నివేదిక పంపించామని, అనుమతి వస్తే తదుపరి కార్యాచరణ ఉంటుందని సీఎం బదులిచ్చారు. దాంతో టీజీ స్పందిస్తూ, హైకోర్టు తరలింపు విషయంలో కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని సీఎంతో అన్నారు.