ఆఫీసే కల్యాణ మండపం: ఒక్కటైన ఐఏస్ అధికారి, ఐపీఎస్ అధికారిణి

  • ప్రేమికుల రోజున ఒక్కటైన జంట
  • పనులతో తీరిక లేక పనిచేసే చోటే రిజిస్టర్ మ్యారేజీ
  • వేడుకలో పాలుపంచుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు
విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండటంతో ఆ అత్యున్నస్థాయి అధికారులు కార్యాలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ కు చెందిన తుషార్ సింగ్లా ఐఏఎస్ అధికారి. అదే రాష్ట్రానికి చెందిన నవజోత్ సిమి ఐపీఎస్ అధికారిణి వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తుషార్ కోల్ కతాలో ఉలుబెరియాలో ఎస్డీవోగా పనిచేస్తోండగా, సిమి బీహార్ రాజధాని పట్నాలో ఉద్యోగం చేస్తోంది.

ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇటీవల వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబాలు అంగీకరించాయి. కార్యాలయ పనిభారంతో ఇద్దరికీ తీరిక దొరకకపోవడంతో పదేపదే తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

తాజాగా నిన్న ప్రేమికుల రోజు నాడు ఇద్దరూ నిర్ణయించుకుని కార్యాలయంలోనే రిజిస్ట్రార్ ను పిలిపించుకుని రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరి కుటుంబ సభ్యులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరుగనున్న శాసన సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన పిదప ఆడంబరంగా విందు ఇస్తామని నూతన దంపతులు మీడియాకు తెలిపారు.


More Telugu News