పాపం పసివాడు... ప్రాణం తీసిన సపోటా గింజ!

  • గొంతుకు అడ్డంగా ఉండిపోయిన పిక్క
  • బాలుడికి ఊపిరాడక పోవడంతో ఆసుపత్రికి తరలింపు
  • అక్కడ చికిత్స పొందుతూ మృతి

తల్లి ఏమరుపాటు ఓ చిన్నారి ప్రాణం మీదికి తెచ్చింది. సమీపంలో ఉన్న సపోటా తినే ప్రయత్నంలో దాని గింజ గొంతుకు అడ్డంగా ఉండిపోవడంతో ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్ దంపతులు. వీరి కొడుకు శివకుమార్ (4). 

భర్త సౌదీలో పనిచేస్తుండడంతో బీడీ కార్మికురాలైన సుజాత మల్లాపూర్ లో తన ఇద్దరు కొడుకులతో ఉంటోంది. సోమవారం సాయంత్రం సపోటా పండ్లు కొనితెచ్చిన సుజాత వాటిని ఇంట్లో పిల్లలకు అందేలా ఉంచి మర్చిపోయింది. తల్లి పనిలో ఉండగా సపోటా పండ్లు చూసిన శివకుమార్ అందులో ఒకదాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. తింటుండగా అందులోని పిక్క గొంతులోకి వెళ్లిపోయి ఇరుక్కోవడంతో ఊపిరాడక పడిపోయాడు. దీన్ని గమనించిన సుజాత హుటాహుటిన కొడుకుని మెట్ పల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ కన్నుమూశాడు.



More Telugu News