: భూవివాదంలో సానియా రెస్టారెంట్
టెన్నిస్ తార సానియా మీర్జా కొత్తగా ప్రారంభించాలనుకున్న 'రిస్ట్రెట్టో' రెస్టారెంట్ భూ వివాదంలో చిక్కుకుంది. దీంతో రెస్టారెంట్ వ్యాపారంలో ప్రవేశించాలన్న సానియా ఆశలకు కొంత కాలం విరామం తప్పేట్టులేదు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొందరు భాగస్వాములతో సానియా ఈ కాఫీ హౌస్ ను ప్రారంభిస్తోంది. అయితే రెస్టారెంట్ స్థలం లీజుకు తీసుకున్నది కావడంతో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
ఇటీవలే ఆ స్థల యజమాని హైకోర్టులో ఆ భూమికి సంబంధించిన కేసులో విజయం సాధించాడు. అయితే అతని ప్రత్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో, కోర్టు 'స్టేటస్ కో' (యధాతథ స్థితి) ఆదేశం ఇచ్చింది. దాంతో, సానియాకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆమె తన రెస్టారెంట్ ను ప్రారంభించే అవకాశం లేదు. కాగా, ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు గట్టిగా పోరాడతామని సానియా వ్యాపార భాగస్వామి శేషు రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.