: వోడ్కా అమ్మకాల్లో కిక్కు తగ్గింది!
కాలంతో పోటీపడే యువతరం అభిరుచుల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సరిగ్గా ఆ లక్షణమే భారత్ లో వోడ్కా అమ్మకాలను ప్రభావితం చేస్తోంది. గత దశాబ్దం వరకు యువత స్వీకరించే మద్యం రకాల్లో వోడ్కానే ప్రథమస్థానంలో ఉండేది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఎగువ మధ్యతరగతి ప్రజలు వోడ్కా స్వీకరించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారు. అయితే, మారుతున్న పరిస్థితులను అనుసరించి వారు ఇతర రకాల మద్యంవైపు మొగ్గడంతో వోడ్కా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని ఓ నివేదిక వెల్లడిస్తోంది.
స్మిర్నాఫ్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లకూ ఈ దుస్థితి తప్పడంలేదట. స్మిర్నాఫ్ అమ్మకాల్లో 10 శాతం లోటు కనిపించగా.. భారత మార్కెట్లో 50 శాతం వాటాదారులైన దేశవాళీ బ్రాండ్లు వైట్ మిశ్చిఫ్, రోమనోవ్ అమ్మకాలు సైతం 11 శాతం మేర పడిపోయాయి. ఇక మ్యాజిక్ మూమెంట్స్ 8 శాతం, ఫ్యూయెల్ 28 శాతం అమ్మకాల్లో క్షీణత కనబరిచాయి. ముఖ్యంగా యువతరం కాక్ టెయిల్, టెకీలా (మెక్సికో), కచాకా(బ్రెజిల్), జపనీస్ విస్కీ బ్రాండ్ల వెంటబడడంతో వోడ్కాకు కష్టకాలం వచ్చిందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.