: కిడ్నాప్ కు గురైన బాలుడి దారుణ హత్య
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లెలో కిడ్నాప్ కు గురైన హర్షిత్ రెడ్డి అనే బాలుడిని దుండగులు కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారు. నిన్న బాలుడిని అపహరించిన కిడ్నాపర్లు రూ.7 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, తమ వద్దనున్న బాలుడు ఏడుస్తుండడంతో తమ ఆచూకీ తెలిసిపోతుందన్న భయంతో ఆ చిన్నారిని గొంతునులిమి హతమార్చారు. అనంతరం ఒబులక్కపల్లి గ్రామ శివార్లలో పాతిపెట్టారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో ఒకరైన శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. ఇతడి స్వస్థలం గుంటూరు జిల్లా దుర్గి. కిడ్పాప్ కు పాల్పడిన నాగారం (మహబూబ్ నగర్ జిల్లా వాసి) అనే మరోవ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితులను తమకు అప్పగించాలని బాలుడు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి మృతదేహంతో రహదారిపై కూర్చోవడంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి.