: 'అవన్నీ పుకార్లే' అంటున్న యడ్యూరప్ప
తాను బీజేపీలో చేరతానంటూ వస్తోన్న వార్తలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఖండించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకుల్లో కొందరు యడ్యూరప్పను మళ్ళీ పార్టీలోకి తేవాలని భావిస్తుండగా.. ఈ లింగాయత్ నేత మాత్రం బీజేపీలో చేరడం కల్ల అని తేల్చి చెబుతున్నారు. బెంగళూరులో నేడు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ లు తమను పార్టీలోకి ఆహ్వానించారట కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఇప్పటికైతే నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా వస్తే అప్పుడు చూసుకుందాం' అని పేర్కొన్నారు.
ఇక మోడీని బీజేపీ ప్రచార సారథిగా నియమించిన అనంతరం అసమ్మతి జ్వాలలు చెలరేగగా.. వాటిని అవకాశంగా తీసుకుని తిరిగి చక్రం తిప్పేందుకు పార్టీలోకి వస్తున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను యడ్డి తోసిపుచ్చారు. 'అవన్నీ వట్టి పుకార్లు. నాకంటూ ఇప్పుడు ఓ గుర్తింపు ఉంది. స్వంత పార్టీ కర్ణాటక జనతా పక్షను బలోపేతం చేసేందుకు త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తాను' అని చెప్పుకొచ్చారు.