: ధోనీ ఆపన్న హస్తం అందించు: అంకుల్ సూచన


ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఆకస్మిక వరదలు వేలాది మంది జీవితాల్లో విషాదం నింపాయి. ఆచూకీ లేకుండా పోయినవారు, మరణించినవారు, గాయాలతో బతికి బయటపడ్డవారు ఇలా ఎంతో మంది బాధితుల కుటుంబాల్లో విషాదం నిండుకుంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. లేదా తమకు చేతైననది అందిస్తున్నారు. కానీ, కోట్లాది మంది భారతీయుల అభిమానంతో, ఆటనే వేదికగా చేసుకుని ఏడాదికి వందల కోట్లు సంపాదించుకుంటున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీకి మాత్రం మనసు ఇంకా కరిగినట్లు లేదు.

హర్బజన్ సింగ్ కూడా వరదల్లో చిక్కుకుని బయటపడ్డవాడే. ఆ బాధేంటో స్వయంగా రుచి చూసిన వెంటనే బాధితులకు బజ్జీ 10లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్ష రూపాయల విరాళాన్ని అందించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన ద్వారా అందుకున్న గోల్డెన్ బ్యాట్ అవార్డును శిఖర్ ధావన్ బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ధోనీలో మానవత్వం ఇంకా స్పందించలేదు.

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలని టీమిండియా కెప్టెన్ ధోనీకి స్వయానా ఆయన మామయ్య పూరణ్ సింగ్ భండారీ పిలుపునిచ్చారు. ఎంతో మంది ప్రముఖులు విరాళాలిచ్చారని, ధోనీ కూడా తప్పకుండా సాయమందించాలని కోరారు. విషయమేమిటంటే ధోనీ తండ్రి పాన్ సింగ్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా, ల్వాలి గ్రామం. ఇక్కడ ధోనీ మేనత్తలు, మామయ్యలు కూడా స్థిరపడ్డారు.

  • Loading...

More Telugu News