: 2 జీ కేసునుంచి త్వరలోనే బయటపడతా: కనిమొళి
2 జీ స్పెక్ట్రం కుంభకోణం కేసునుంచి త్వరలోనే బయటపడతానని డీఎంకే మహిళా నేత కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నిక దృవీకరణ పత్రంతో సీఐటీ నగర్ లోని తండ్రి కరుణానిధి నివాసానికి కనిమొళి చేరుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తన విజయం కోసం తన తండ్రి కరుణానిధి, అన్న స్టాలిన్ ఎంతో కృషి చేశారని, ఇది స్టాలిన్ విజయమేనని ఆమె తెలిపారు. 2 జీ స్పెక్ట్రం కేసు విచారణలో ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు ఎన్నికల్లో నిలవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయన్న విలేకరుల ప్రశ్నకు కనిమొళి బదులిస్తూ, కేసు విచారణ పూర్తయిన తరువాతే పోటీ చేయాలనే నిబంధనలేవీ లేవని, కేసులు విచారణలో ఉండగానే బరిలో నిలిచిన నేతలు చాలామంది ఉన్నారని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలేవీ నిరూపితమవ్వలేదని, త్వరలోనే నిర్ధోషిగా బయటపడతానన్న విశ్వాసం కనిమొళి వ్యక్తం చేశారు.