: తల్లడిల్లుతున్న అమ్మ మనసు!
పొద్దున్నే టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఏదైనా వస్తే... ఆ ముసలి తల్లి వణికిపోతోంది... కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది... ఆ వీధిలో పోస్ట్ మెన్ కనిపిస్తే చాలు... ఆ అమ్మ మనసు తల్లడిల్లిపోతోంది... స్పీడు పోస్టులో ఏదైనా అశుభం తెస్తున్నాడా... అని కంగారుపడిపోతోంది. ఆ అమ్మ పేరు అర్పుతం అమ్మాళ్. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉరిశిక్ష పడి జైలులో రోజులు లెక్కపెడుతున్న పెరరివలన్ కన్న తల్లి ఆమె!
గత ఇరవై రెండేళ్ళ నుంచి జైలులో వున్న కొడుకు ఉరి శిక్షను తప్పించుకుని విడుదలై ఎప్పుడు ఇంటికి వస్తాడా... అని ఆ కన్నపేగు ఆశగా ఎదురుచూస్తోంది. నా కొడుకుకి ప్రాణభిక్ష పెట్టండి... అంటూ కనిపించిన ప్రతి ఒక్కరికీ ఆమె చేతులు జోడించి మరీ వేడుకుంటోంది. అఫ్జల్ గురూని చడీ చప్పుడూ లేకుండా ఉరి తీసేసి, ఆ వార్తని స్పీడు పోస్టులో అతని భార్యకు పంపిన వార్త తెలిసి నప్పటి నుంచీ ఆ తల్లి మనసు పడుతున్న వేదన వర్ణనాతీతం.
అమ్మాళ్ వయసు 66 ఏళ్ళు. చెన్నయ్ లో మనవడి దగ్గర ఉంటోంది. ఆమె భర్త కుయిల్ దాసన్ వయసు 76. తమిళ కవి అయిన ఆయన కూతురు వద్ద ఉంటున్నాడు. కొడుకు అరివు (పెరరివలన్) అంటే ఆమెకు ప్రాణం. 'నా కొడుకు చిన్నప్పటి నుంచీ చదువులో బాగా రాణించేవాడు. హయ్యర్ సెకండరీ పరీక్ష డిస్టింక్షన్ లో పాసయ్యాడు' అంటుంది ఆమె గర్వంగా. కొడుకుతో కలిసి చిన్నప్పుడు తను పాడుకున్న పాటలని గుర్తుచేసుకుని ఆమె కన్నీరు పెట్టుకుంటోంది. ఇళయరాజా పాటలంటే అరివుకి ఎంతో ఇష్టమట!
వేలూరు జైలులో వున్న కొడుకుని తరచుగా కలిసి వస్తుంటుంది. వెళ్ళినప్పుడల్లా తమిళ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు పట్టుకెళుతుంది. కొడుకుని చూసి బోరున విలపిస్తుంది. కొడుకే ఆమెను ఓదార్చి, ధైర్యం చెబుతాడు. మొన్నటి వరకు ఆమె కాస్త ధైర్యంగానే వుంది. ప్రభుత్వం తన కొడుకుకి ప్రాణభిక్ష పెడుతుందని...! అయితే అఫ్జల్ గురుని ఉరి తీసిన దగ్గర్నుంచీ ఆ తల్లి మనసు మనసులా లేదు. వున్న ధైర్యం కాస్తా పోయింది. ఏ క్షణం తన కొడుకు తనకు శాశ్వతంగా దూరమైపోతాడోనన్న భయం పట్టుకుంది. నిద్ర లేదు... అంతా కలత నిద్రే... ఉలిక్కిపడి లేస్తుంది... బోరున ఏడుస్తుంది... తిండి లేదు...బలవంతంగా తినిపించినా ఏడిచి ఏడిచి తిన్న నాలుగు ముద్దలూ కక్కేసుకుంటుంది.
అమ్మాళ్ ఇప్పుడు కేవలం తన కొడుకుకే కాదు. మరణశిక్ష పడిన వాళ్ళందరికీ ప్రాణ భిక్ష పెట్టమంటోంది. అసలు మరణ శిక్షనే రద్దు చేయమంటోంది. అందుకే, తన చీర కొంగుకి ఓ బ్యాడ్జీ కూడా తగిలించుకుంది... దాని మీద 'మరణ దండనై ఒజిపామ్' అని తమిళంలో రాసుంది. అంటే మరణ శిక్షను రద్దు చేయాలి... అని అర్ధం. మరి, ఆ అమ్మ కోరిక తీరుతుందా? నేను బతికుండగా నా కొడుకు మరణించకూడదు... అని కోరుకుంటున్న ఆ కన్న ప్రేమ విజయం సాధిస్తుందా?