: పాక్ జైల్లో మరో భారత ఖైదీకి నూకలు చెల్లాయి
పాకిస్తాన్ జైళ్ళు భారత ఖైదీల పాలిట మృత్యుకూపాల్లా పరిణమిస్తున్నాయి. సరబ్ జిత్ సింగ్ అనుమానాస్పద మరణాన్ని మరువక ముందే మరో భారత ఖైదీ తుది శ్వాస విడిచాడు. లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న జకీర్ ముంతాజ్ (50) అనే భారతీయుడు గురువారం రాత్రి గుండె పోటుతో మరణించాడు. అస్వస్థతగా ఉందని జైలు అధికారులకు తెలపడంతో వారు అతన్ని జిన్నా ఆసుపత్రికి తరలించారు. జకీర్ చికిత్స పొందుతూనే కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ అతని మరణానికి కారణమని వారు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, పోస్ట్ మార్టమ్ అనంతరం జకీర్ మృతికి స్పష్టమైన కారణాలు వెల్లడవుతాయి.
పంజాబ్ లోని అమృత్ సర్ సమీప గ్రామవాసి అయిన జకీర్ 2011 ఆగస్టు 3న సరిహద్దు దాటి తమ దేశంలో అక్రమంగా ప్రవేశించాడని పాక్ బలగాలు అతడిని అరెస్టు చేశాయి. తొలుత షేక్ పురా జైలులో కొన్నాళ్ళు శిక్షకాలం గడిపిన అనంతరం ఈ భారత జాతీయుడిని లాహోర్లోని కోట్ లఖ్ పత్ జైలుకు తరలించారు. కోట్ లఖ్ పత్ జైల్లోనే సరబ్ జిత్ సింగ్ పై తోటి ఖైదీలు కిరాతకంగా దాడి చేయగా.. జిన్నా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.