: సభ సాయంత్రానికి వాయిదా
కళంకిత మంత్రుల వ్యవహారం శాసనసభలో అగ్గిరాజేసింది. టీడీపీ, అధికార కాంగ్రెస్ మధ్య తీవ్ర ఆగ్రహావేశకాలను రగిల్చింది. ఈ నేపథ్యంలో సభను ఓసారి వాయిదావేసిన డిప్యూటీ స్పీకర్ మల్ల్లు భట్టివిక్రమార్క.. పరిస్థితిలో ఏమాత్రం మార్పురాకపోవడంతో శాసనసభ సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు సభ సాఫీగా జరిగేందుకు సహకరించాలని విపక్ష, అధికార సభ్యులకు ఎంత నచ్చచెప్పినా వారు వినలేదు. ఒకరిపై ఒకరు పరుష వ్యాఖ్యలు చేసుకుంటూ, వాడివేడి వాతావరణాన్ని సృష్టించారు.
కళంకిత మంత్రులను తొలగించాల్సిందే అని టీడీపీ సభ్యులు పట్టుబట్టగా.. వారిపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేసి, టీడీపీ సభ్యుల ప్రతిస్పందన తీవ్రంగా ఉండడంతో చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్టు ఎక్కడా రుజువుకాలేదని, అయినా, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడడం సరికాదని ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు.