: విండీస్ కు 'స్లో ఓవర్' పోటు
మూలిగే నక్కపై తాటిపండు.. అంటే ఇదేనేమో! దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో గెలుపు ముంగిట వరుణుడు మోకాలడ్డడంతో సెమీస్ చాన్సులు చేజార్చుకున్న వెస్డిండీస్ జట్టుకు జరిమానా రూపంలో మరో దెబ్బ తగిలింది. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో ఉన్న ఈ కరీబియన్ జట్టు నిన్న సఫారీలతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు నమోదు చేసిందన్న కారణంతో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ విండీస్ ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
ఆటగాళ్ళ పారితోషికంలో 10 శాతం, కెప్టెన్ బ్రావో మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా చెల్లించాలని రిఫరీ ప్రకటించారు. వర్షం కారణంగా విండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ను 31 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. అయితే, బ్రావో సేన నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైంది. నిర్ధారిత సమయానికి ఒక్క ఓవర్ ను తక్కువగా విసిరి మూల్యం చెల్లించుకుంది.