: తల్లిని నరికి చంపిన కిరాతకుడు
నవమాసాలు మోసి ఆ బిడ్డను భూమ్మీదకు తెచ్చిన తల్లి ఊహించి ఉండదు, అతని చేతిలోనే తాను కడతేరతానని. వాస్తవంలో అలాగే జరిగింది. ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండలం వంగపాడులో ఓ వ్యక్తి కన్నతల్లినే చంపేశాడు. వివరాల్లో కెళితే.. కామిరెడ్డి చెంచమ్మకు ముగ్గురు కుమారులున్నా ఆమె మాత్రం విడిగానే ఉంటోంది. ఇక ఆ తనయులూ ఎవరికివారు వేరు కాపురాలు ఉంటున్నారు. వారిలో చిన్నవాడైన పాండురంగారెడ్డి సమీపంలోని పాపయ్యపల్లెలో నివాసముంటున్నాడు. ఏమైందో ఏమోగాని బుధవారం రాత్రి పాండురంగారెడ్డి ఓ పదునైన గొడ్డలితో తల్లిని నరికి చంపాడు. కాగా, అతనికి మతిస్థిమితంలేదని కొందరు చెబుతుండగా, మరికొందరు ఆస్తి తగాదాలే హత్యకు కారణమని అంటున్నారు. ఏదేమైనా, నిజానిజాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.