: చనిపోయిన వాళ్ళు తిరిగి బతుకుతారా!?


మనిషికి అనివార్యమైన విషయాల్లో మరణం అత్యంత బాధాకరమైనది. కాసేపట్లో చనిపోతామని తెలిస్తే ఆ వ్యక్తి పడే వేదన, అతని కుటుంబ సభ్యులకు కలిగే శోకం ఎవరూ తీర్చలేనివి. పుట్టినవాళ్ళు గిట్టక తప్పదని తెలిసినా.. బంధాలు, అనుబంధాలు గాఢంగా పెనవేసుకుని మనిషిని మరణం పట్ల బేలగా మార్చేస్తాయి. కానీ, అమెరికాలోని కొందరు పరిశోధకులు మాత్రం మృత్యువు పట్ల ఆశావహ దృక్పథం కనబరుస్తున్నారు. తాము మరణించినా, తమ శరీరాలను భద్రపరుచుకోవాలని భావిస్తున్నారు.

ఎందుకంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా, మానవాళికి మరణానంతరం జీవం పోయగల పరిజ్ఞానం ఎవరైనా ఆవిష్కరించకపోతారా, తాము మళ్ళీ సజీవులం కాకపోతామా అన్నది వీరి ఆలోచన. ఇంతకీ ఈ ఆశావాదులెవరంటే, అమెరికాలోని ఆక్స్ ఫర్డ్ మార్టిన్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు ప్రొఫెసర్ నిక్ బోస్ట్రమ్, ఆండర్స్ శాండ్ బెర్గ్, స్టూవర్ట్ ఆర్మ్ స్ట్రాంగ్. తాము చనిపోయిన తర్వాత తమ విగత దేహాలను సురక్షితంగా భద్రపరచేందుకు వీరు ఇప్పటినుంచే ఓ సంస్థకు పాలసీ కూడా కడుతున్నారండోయ్. చనిపోయిన వారిని భద్రపరుస్తాం అంటోన్న ఆ సంస్థ పేరు ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్. బోస్ట్రమ్, శాండ్ బెర్గ్ లు తమ తలలను మాత్రమే భద్రపరిచేందుకు సదరు సంస్థకు ఒక్కొక్కరు రూ.45 లక్షలు చెల్లించగా.. ఆర్మ్ స్ట్రాంగ్ మాత్రం పూర్తి శరీరాన్ని పదిలపరిచేందుకు కోటి రూపాయలు చెల్లించాడట.

కాగా, క్రయోప్రిజర్వేషన్ విధానంలో ఈ దేహాలను పాడవకుండా చూస్తామని ఆల్కర్ లైఫ్ ప్రతినిధులు అంటున్నారు. తమ క్లయింట్లు కాసేపట్లో పోతారనగా.. సమాచారం అందుకున్న ప్రత్యేక వైద్య నిపుణులు అక్కడికి చేరుకుంటారు. వారు చనిపోయారని డాక్టర్లు చెప్పడం ఆలస్యం ఈ స్పెషల్ డాక్టర్లు రంగంలోకి దిగుతారు. అత్యంత జాగ్రత్తగా ఆ శరీరాలను, తలలను భద్రపరిచేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తారు.

నైట్రోజన్ గ్యాస్ ద్వారా మృత దేహాల ఉష్ణోగ్రతను -196 సెంటిగ్రేడ్ కి తగ్గిస్తారు. అటు పిదప దాన్ని ఓ ద్రవరూప నైట్రోజన్ తొట్టెలో ఉంచడంతో వీరి పని పూర్తవుతుంది. మున్ముందు.. శాస్త్రవేత్తలు మనిషికి జీవం పోసే పరిజ్ఞానాన్ని సాధించినప్పుడు ఆ దేహాలను బయటికి తీసి వాటిలో జీవం నింపుతారు. ఇదండీ విషయం. ఇప్పటికే ఈ సంస్థలో 974 మంది మరణానంతరం తమ శరీరాలను పదిలపరచండంటూ నెలకు రూ.4 వేల చొప్పున పాలసీలు కడుతున్నారట. విశేషమేమిటంటే, వారిలో 33 పెంపుడు జంతువులు కూడా వున్నాయి!

  • Loading...

More Telugu News