Smitha Sabarwal: స్మితా సబర్వాల్‌కు నోటీసులపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Shridhar Babu Responds to Smitha Sabarwals Notice
  • స్మితా సబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం వెళతామన్న మంత్రి
  • సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న శ్రీధర్ బాబు
  • రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతో మోదీ మాట్లాడారన్న మంత్రి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం తాము ముందుకు వెళతామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సహజమేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచ గచ్చిబౌలి భూములపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తమది కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నట్లుగా భావిస్తున్నామని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Smitha Sabarwal
Shridhar Babu
AI Photo
Notice
Gachibowli Land
Telangana Politics
Supreme Court
BJP
BRS
Narendra Modi

More Telugu News