Computer: కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక... కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి

Gujarat Man Chops Off Own Fingers To Avoid Working As Computer Operator

  • గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘటన
  • బంధువుల దుకాణంలో పని చేస్తున్న మయూర్ తారాపర
  • పని చేయడం ఇష్టం లేదని ఎవరికీ చెప్పలేక వేళ్లు నరుక్కున్న మయూర్
  • కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

గుజరాత్‌లోని సూరత్‌లో విచిత్రమైన... విషాదకర సంఘటన జరిగింది. బంధువులకు చెందిన వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు... ఆ ఉద్యోగం చేయడం నచ్చక తన ఎడమ చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.

సూరత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మయూర్ తారాపర (32) రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతని చేతివేళ్లు కూడా తెగిపోయినట్లుగా గుర్తించారు. పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందో పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు. కానీ మయూర్ మొదట ఓ కట్టు కథను అల్లాడు. తన చేతి వేళ్లను ఎవరో కత్తిరించారని చెప్పాడు. అయితే ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలో చూడగా... పని చేయడం ఇష్టం లేక తనకు తానే ఉద్దేశపూర్వకంగా చేతి వేళ్లను నరుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు.

నగరంలోని వరచ్చా మినీ బజార్‌లోని తన బంధువుల డైమండ్స్ దుకాణంలో పని చేయడం ఇష్టం లేకే మయూర్ ఈ చర్యకు పాల్పడినట్లుగా సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పని చేయలేనని అతను తన కుటుంబ సభ్యులకు, యజమానికి చెప్పలేక ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తన ఎడమ చేతి నాలుగు వేళ్లను కత్తితో నరుక్కొని... బ్యాగులో వేసి... పడేశాడు.

ఇందుకోసం సింగన్‌పూర్‌లోని చార్ రాస్తా సమీపంలోని ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. కత్తిని కొనుగోలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఓ రాత్రి అమ్రోలి రింగ్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ మోటార్ సైకిల్‌ను పార్క్ చేసి రాత్రి పది గంటల సమయంలో తన చేతి వేళ్లను నరుక్కున్నాడు.

మయూర్ ఈ దుకాణంలో అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అమ్రోలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ అయింది.

  • Loading...

More Telugu News