Chandrababu: డోకిపర్రు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

AP CM Chandrababu offer prayers at dokiparru venkateswara swamy temple

  • ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారని ప్రశంస
  • బీపీఎల్ కుటుంబాలకు చేయూతనివ్వాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం
  • తోడ్పాటునందించేందుకు ముందుకొచ్చిన కృష్ణారెడ్డి

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయం నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

'వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లో పేదరిక నిర్మూలనకు గురించి ప్రస్తావించాం. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం, దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి. జమిలి విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలన్నీ ఒకసారి జరిగితే అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమే పని చేయాల్సి ఉంటుంది.' అని సీఎం అన్నారు.

పీ4 విధానంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు చొరవ తీసుకోవాలని కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు కృష్ణారెడ్డి అంగీకరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.
 

  

  • Loading...

More Telugu News