Nadendla Manohar: ‘అన్నదాతకు అండగా వైసీపీ’ నిరసనలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సెటైర్లు

Minister Nadendla Manohar said government brought many reforms in grain procurement

  • వైసీపీ నాయకులు ధాన్యం బస్తాలతో వెళ్లి ఫొటోషూట్లు చేశారు
  • విమర్శలు గుప్పించిన మంత్రి నాదెండ్ల
  • వైసీపీ ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించామని వెల్లడి
  • చంద్రబాబు, పవన్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తుంటారన్న మంత్రి

‘అన్నదాతకు అండగా వైసీపీ’ పేరిట విపక్ష పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టరేట్ల వద్దకు ధాన్యం బస్తాలు తీసుకెళ్లి ఫొటో‌షూట్లు చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత సీజన్‌లో వైసీపీ ప్రభుత్వం గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీస సేకరణ కూడా చేపట్టలేదని, ఎందుకు చేయలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపించే విషయంలో చంద్రబాబు సర్కారు ముందుంటుందని, అన్నదాతలకు అండగా నిలుస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ధాన్యం కొనుగోలు విషయంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతన్నలకు బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని, వైసీపీ సర్కారు చెల్లించాల్సిన బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా శనివారం ఆయన స్పందించారు.

రైతులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడుతుందో జనాలకు తెలుసునని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో గత ఖరీఫ్ సీజన్‌లో డిసెంబర్ 13 నాటికి 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని, అయితే కూటమి ప్రభుత్వం ఈ సీజన్‌లో ఇప్పటికే 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని ఆయన వివరించారు.

ఈ ఏడాది సంక్రాంతి పండుగ రాకముందే రైతుల కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవదని ఆయన పునరుద్ఘాటించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులను ఎవరైనా ఇబ్బంది పెట్టారని తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News