Telangana: తెలంగాణపై చలిపులి పంజా.. భారత వాతావరణ కేంద్రం కీలక ప్రకటన

IMD Hyderabad has issued intense cold wave alert for Telangana till December 14

  • శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ
  • అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిక
  • ఉదయం, సాయంత్ర సమయాల్లో చలి అధికంగా ఉంటుందని వెల్లడి

తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే వాతావరణం శనివారం (డిసెంబర్ 14) వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా శనివారం ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 5 డిగ్రీల సెల్సియస్‌ స్థాయికి పడిపోవచ్చని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అప్రమత్తం చేసింది.

కాగా బుధ, గురువారాల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, మెదక్, సంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో ఎముకలు కొరికే చలితో జనాలు తెగ ఇబ్బందిపడుతున్నారు.

చలిగాలులు తీవ్రంగా ఉండనుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని, ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలని సలహా ఇచ్చింది. 

మరోవైపు, హైదరాబాద్‌ నగరంలో డిసెంబర్ 15 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని అప్రమత్తం చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా వాతావరణం ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News