: ఈ కృష్ణుడికి 14 మంది భార్యలు...!
ఆ శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అని మనం చదువుకున్నాం... అయితే ఆయనకు వారివల్ల ఏమాత్రం సంతానం కలిగింది అనే విషయాలు మనకు అంతగా తెలియవు. అయితే ఈ కలియుగ కృష్ణుడికి మాత్రం తన 14 మంది భార్యల వల్ల 22 మంది సంతానం. అంతేకాదు... 'నా సంతానాన్ని నేను పోషించలేను మహాప్రభో' అంటూ ప్రభుత్వాన్ని పోషించాల్సిందిగా కోరుతున్నాడు. దీంతో అమెరికాలోని టెన్నిసీలో ఓర్లాండో షా అనే పేరు వింటే చైల్డ్ సపోర్ట్ అధికారులు తెగ భయపడిపోతున్నారు. ఎందుకంటే, సదరు కలియుగ కృష్ణయ్య ఆయనేమరి!
ఓర్లాండో ఎలాగోలా 14 మంది మగువలను బుట్టలో పెట్టేశాడు. వాళ్లకు మొత్తం 22 మంది సంతానం సదరు మొగుడుగారి వల్ల కలిగారు. అయితే తన సంతానాన్ని పోషించాల్సిన బాధ్యత ఓర్లాండోపై పడేసరికి నా వల్లకాదు మొర్రో అంటూ పిల్లల్ని పోషించాల్సిందిగా బిడ్డలకు జన్మనిచ్చిన తల్లుల తరపున పోషణ కోరుతూ ఆయనగారు నాష్‌విల్లే కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్‌గారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. తన సంతానాన్ని పోషించాలంటే ఓర్లాండో షా మొత్తం నాలుగు ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ రోసెన్‌బర్గ్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
అయినా... నిండా మునిగిన వాడికి చలి ఎక్కడుంటుంది... అన్నట్టుగా ఒకసారి జైలు శిక్ష పడ్డవాడికి ఆ శిక్ష కొత్తేమీ కాదుకదా...! ఈ కేసు విచారణ పూర్తయితే మాత్రం అతనికి శిక్ష పడుతుంది. అయితే తన సంతానాభివృద్ధి గురించి షాగారు మాట్లాడుతూ "నేను యువకుడిని, మహిళలను ప్రేమిస్తాను, నేను ప్రేమించిన అమ్మాయిల సంఖ్య సరిగా గుర్తులేదు... బహుశా 18 మందితో 17 మంది పిల్లల్ని కనిఉంటాను... అయినా ఎంతమంది పిల్లలు అనే సంఖ్య గురించి నేను పెద్దగా పట్టించుకోను, వారందరినీ నేను సమానంగా ప్రేమిస్తాను, వారంతా కూడా నా ఇంటిపేరు 'షా'ను తరతరాలపాటు నిలబెడతారు" అంటూ తెగ సంతోషంతో మురిసిపోతున్నాడు ఓర్లాండో. నిజానికి తాను ఓ 50 మంది పిల్లల్ని కనాలనుకున్నానని, అయితే వారి పోషణకు సంబంధించిన ఖర్చులకు సంబంధించిన కేసుల్ని భరించలేకపోతున్నానని, కాబట్టి వేసెక్టమీ చేయించుకోవాలనుకుంటున్నట్టు ఆయనగారు సెలవిచ్చారు. ఈ మాట చైల్డ్ సపోర్ట్ అధికారులకు మహదానందాన్ని కలిగిస్తోంది.