: నక్సల్స్ సమస్య పరిష్కారానికి సరికొత్త పథకం
ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల దాడితో అప్రమత్తమయిన కేంద్రం నక్సల్స్ సమస్య పరిష్కారానికి సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా ఉండడానికి 'రోష్నీ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మావోయిస్టు ప్రభావిత 24 జిల్లాల్లోని 50 వేలమంది యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందే వారిలో కనీసం 50 మంది మహిళలు ఉంటారన్నారు. ఇలా శిక్షణ పొందిన నిరుపేద యువతకు వ్యవస్థీకృత రంగంలో ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. ప్రధానంగా గిరిజన యువతను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించామని జైరాం రమేశ్ తెలిపారు. శిక్షణ ఇచ్చే సంస్థలు కనీస వేతనం కంటే ఎక్కువ జీతం చెల్లిస్తూ మూడునెలల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.