: ఏపీపీఎస్సీ తీరుపై మండిపడ్డ బాబు
ఎన్నో లక్షలమంది విద్యార్థులు ఏపీపీఎస్సీ ప్రకటించే ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుంటుంటే బోర్డు మాత్రం అక్రమాలు, అవినీతిలో మునిగితేలుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో బాబు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీపీఎస్సీలో అక్రమాలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ముఖ్యంగా బోర్డులోని సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రశేఖర్, మాలిక్, రిపుంజయరెడ్డి, పద్దయ్య, సీతారామరాజు వంటి వ్యక్తులకు తగిన అర్హతలు లేకున్నా ఏపీపీఎస్సీలో చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. వీరందరి విద్యార్హత డిగ్రీ అనీ.. వారు పీజీలు, పీహెచ్ డీలు చేసిన ఉన్నత విద్యావంతులను ఇంటర్వ్యూ చేయడం హాస్యాస్పదం అని బాబు వ్యాఖ్యానించారు. సభ్యులు ఉద్యోగాలను అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీపీఎస్సీలో బ్రోకర్ల రాజ్యం నడుస్తోందని ఆయన విమర్శించారు. అందుకు సీతారామరాజు.. సంధ్య అనే దళారీతో కుమ్మక్కైన విషయాన్ని ఉదహరించారు. కాగా, టీడీపీ హయాంలో ఏటా డీఎస్సీ నిర్వహించినా ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణలు రాలేదని బాబు గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఏపీపీఎస్సీ భ్రష్టు పట్టిందని చెబుతూ, ఆఖరికి వైస్ చాన్సలర్ పోస్టులను కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు.