Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికే శ్వేతపత్రం విడుదల చేశాం: మల్లు భట్టి విక్రమార్క
- అంకెల గారడీతో తొమ్మిదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారన్న మల్లు భట్టి
- రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లడంపై సభలో చర్చిద్దామని సూచన
- బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు... చేసిన ఖర్చుకు మధ్య అంతరం ఉందని వ్యాఖ్య
అంకెల గారడీతో తొమ్మిదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉందో చెప్పడానికే శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని తాము విపక్షాలను కోరుతున్నామన్నారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లడంపై సభలో చర్చిద్దామని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో వాస్తవాలకు దూరంగా బడ్జెట్ రూపకల్పనలు చేసిందని ఆరోపించారు. వారి పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు... చేసిన ఖర్చుకు మధ్య అంతరం చాలా ఉందన్నారు. ఇలా అంకెల గారడీతో తొమ్మిదేళ్లు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.