: అమెరికా 'ప్రథమ మహిళ'కు చేదు అనుభవం
పాశ్చాత్య దేశాల్లో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఎన్నాళ్ళుగానో ఉద్యమాలు జరుగుతున్నాయి. పలుసార్లు ఉద్యమకారులు హింసాత్మక ఘటనలకూ పాల్పడ్డారు కూడా. అయితే, అమెరికాలో స్వలింగ సంపర్కుల కోసం 'గెట్ ఈక్వల్' అనే స్వచ్ఛంద సేవా సంస్థ అవిశ్రాంతంగా పోరాడుతోంది. కార్యాలయాల్లో ఉద్యోగుల ఎంపిక సమయంలో స్వలింగ సంపర్కులకూ అవకాశాలు కల్పించాలని 'గెట్ ఈక్వల్' డిమాండ్ చేస్తోంది. తాజాగా, ఆ సంస్థకు చెందిన కార్యకర్త ఎలెన్ స్టర్జ్ సాక్షాత్తూ అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఎదుటే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.
డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఓ విరాళాల సేకరణ కార్యక్రమానికి లేడీ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తుండగా స్టర్జ్ పలుమార్లు హెచ్చుస్వరంతో నినాదాలు చేసి చికాకు పరిచారు. దీంతో సహనం కోల్పోయిన అమెరికా ప్రథమ మహిళ తానిక మాట్లాడనంది. స్టర్జ్ గొంతు చించుకోవడం ఆపాలని, లేదా మైకు వద్దకు వచ్చి అభిప్రాయం చెప్పాలని కోరింది. అయినా, సదరు స్వచ్ఛంద కార్యకర్త పంథా వీడకపోవడంతో భద్రత సిబ్బంది జోక్యం చేసుకుని ఆమెను బలవంతంగా అక్కణ్ణించి తరలించాల్సి వచ్చింది.